ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక!

  • స్వతంత్రంగా నిర్ధారించుకోలేని అమెరికా నిఘా సంస్థలు
  • ఇజ్రాయెల్‌ హెచ్చరికల్లో మరో కోణమూ ఉండొచ్చన్న అనుమానాలు
  • ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించేందుకు ఇదొక సాకు అయి ఉండొచ్చన్న విశ్లేషణలు
  • తనను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుందని ఇటీవల స్వయంగా ప్రకటించిన ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాను ఇజ్రాయెల్‌ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్‌ ఇటీవల పెంటగాన్‌కు అందించిన నిఘా నివేదికలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ రూపొందించిన ప్రత్యేక ప్రణాళికను ఇజ్రాయెల్‌ అగ్రరాజ్యానికి అందజేసింది. అయితే ఈ సమాచారాన్ని అమెరికా నిఘా సంస్థలు ఇప్పటివరకు స్వతంత్రంగా నిర్ధారించలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ హెచ్చరికకు ముందు అలాంటి కుట్రపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి.

కొంతమంది అమెరికా అధికారులు మాత్రం ఈ హెచ్చరిక వెనుక మరో కోణం ఉండొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌పై మరింత సైనిక చర్యలకు ట్రంప్‌ను ఒప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్‌ ఈ సమాచారం ఇచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఇరాన్‌ మాత్రం చాలా కాలంగా ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగానే హెచ్చరిస్తూ వస్తోంది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌కు చెందిన అగ్ర కమాండర్‌ ఖాసీ సులేమానీ హత్యకు అమెరికానే కారణమని టెహ్రాన్‌ ఆరోపిస్తోంది. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన ఆ ఘటనకు ప్రతీకారం తప్పదని పలుమార్లు ప్రకటించింది.

ఇటీవల కూడా తన ప్రాణాలకు ఇరాన్‌ నుంచి ముప్పు ఉందని ట్రంప్‌ స్వయంగా వ్యాఖ్యానించారు. నాటో సదస్సు సందర్భంగా మాట్లాడుతూ.. ఇరాన్‌ లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో తన పేరు ఉందని, ఇప్పటివరకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పారు.

Donald Trump
Iran
Israel
Assassination Plot
Pentagon
Qasem Soleimani

More Telugu News